అక్టోబర్‌లో అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో

09 June, 2018 - 5:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోను ‘గూగుల్’కు అనుసంధానం చేస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో రైలులో రోజుకు ఎనభై వేల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. అమీర్‌పేట్- హైటెక్ సిటీ వరకు మెట్రో రైలును అక్టోబర్‌లో ప్రారంభిస్తామని, ప్రస్తుతం అమీర్‌పేట్- ఎల్బీనగర్ వరకు ఎలక్ట్రిసిటీ టెస్ట్ రన్ జరుగుతోందని చెప్పారు. జూలై చివరి నాటికి ట్రయల్ రన్ పూర్తిచేసి ఆగస్టులో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని 2019 మార్చిలోగా పూర్తిచేస్తామని, ‘పాతబస్తీలో మెట్రో’ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ‘మెట్రో’ రెండో దశలో భాగంగా అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు అనుసంధానం చేస్తామని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రో పిల్లర్లకు యూనిక్ నెంబరింగ్ ఇస్తామని, కారిడార్ 1కు ‘ఏ’, కారిడార్ 2కు ‘బి’, కారిడార్ 3కి ‘సీ’ ఇస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.