పనీ పాటా లేకే కాంగ్రెస్ పార్టీ ధర్నాలు!

12 September, 2017 - 6:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నిజామాబాద్: పనీ పాటా ఏదీ లేకపోవడంతో ఏం చేయాలో కాంగ్రెస్‌ నాయకులకు తోచడం లేదని, అందుకే ధర్నాలు చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌‌పల్లిలో మంగళవారం జరిగిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో మంత్రి పోచారం మాట్లాడారు.

రైతులను సంఘటితం చేసి ఆత్మాభిమానంతో, గౌరవంగా బతకడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, దానిలో భాగమే రైతు సమన్వయ సమితులని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 10,733 రెవిన్యూ గ్రామాలలో గ్రామ రైతు సమన్వయ సంఘాలను, 577 మండల రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

దేశంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ రైతులకు ముందస్తు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4000 ఇస్తున్నారని పోచారం తెలిపారు. వీటితో పాటు పండించిన పంటకు మద్దతు ధర అందించటానికి రాష్ట్ర రైతు సంఘం వద్ద రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించామన్నారు. ఈ చర్యలతో మూడు, నాలుగేళ్లలో రైతులు ఆర్ధికంగా బలపడి, అప్పుల నుంచి బయటపడతారని చెప్పారు.

అదే విధంగా రాష్ట్రంలో భూమి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి పోచారం అన్నారు. ఈ రికార్డుల ఆధారంగానే వచ్చే వానాకాలం నుంచి ఎకరాకు ముందస్తు పెట్టుబడిగా మే 15 నాటికి రైతుల ఖాతాలో రూ. 4000 జమ చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఇంచార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.