‘అభిమన్యుడు’ సినిమా రివ్యూ..!

01 June, 2018 - 1:56 PM

పేరు: అభిమన్యుడు
జానర్: యాక్షన్‌ థ్రిల్లర్‌
తారాగణం: విశాల్‌, అర్జున్‌, సమంత, ఢిల్లీ గణేష్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత: విశాల్‌
దర్శకత్వం: పీఎస్‌ మిత్రన్‌
విభిన్న కథాంశాలు, విలక్షణమైన పాత్రల్ని ఎంపిక చేసుకోవడంలో హీరో విశాల్‌ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. పందెంకోడి మొదలు విశాల్ అభిరుచిని ఆయన చిత్రాలు గుర్తు చేస్తుంటాయి. ఈ యంగ్ హీరో కోలీవుడ్‌‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్‌‌ మార్కెట్‌‌ను కూడా కొల్లగొట్టాలని చాన్నాళ్లుగా కష్టపడుతున్నాడు.

గతంలో విశాల్ నటించిన కొన్ని చిత్రాలు టాలీవుడ్‌లోరే విజయాలు సాధించి విషయం తెలిసిందే. అదే ఊపులో మరో డిఫరెంట్‌ ఎంటర్‌‌టైనర్‌‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు విశాల్ తాజాగా ‘అభిమన్యుడు’ మన ముందుకు వచ్చాడు. కోలీవుడ్‌‌లో ఘనవిజయం సాధించిన ‘ఇరుంబు తిరై’ సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు.

అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా? కోలీవుడ్‌‌లో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా? ఓ లుక్కేద్దాం.స్టోరీ:
కర్ణ (విశాల్) ఓ ఆర్మీ ఆఫీసర్. కోపం, ఆవేశం ఎక్కువ. పేదరికం, తండ్రి చేసిన అప్పులు, ఇతర కారణాల వల్ల చిన్నతనంలోనే కుటుంబానికి దూరమై ఒంటరిగా పెరుగుతాడు. డాక్టర్ లక్ష్మీదేవి (సమంత) పరిచయంతో కుటుంబానికి దగ్గరవుతాడు. చెల్లెలి పెళ్లి కోసం తీసుకొన్న బ్యాంకు రుణం, తల్లి సంపాదన అంతా కలిసి పది లక్షల రూపాయలు ఉన్నట్టుండి కర్ణ బ్యాంకు ఖాతా నుంచి మాయమవుతాయి. అకౌంట్‌లోని డబ్బులు ఎలా మాయం అయ్యాయని పరిశోధన చేసే క్రమంలో హ్యాకర్ వైట్ డెవిల్ (అర్జున్) గురించి తెలుసుకుంటాడు. ఎంతో మంది బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలిస్తున్న వైట్ డెవిల్ నుంచి తన డబ్బే కాకుండా.. ఇతరుల డబ్బును ఎలా వెనక్కి తెప్పించాడు. వైట్ డెవిల్ వేసే ఎత్తులకు ఎలా పైఎత్తులు వేశాడనే అభిమన్యుడు చిత్ర కథ.నటీనటులు:
విశాల్‌ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత పరిణతి చెందినట్టుగా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్స్‌‌లో కూడా బాగా చేశాడు. మిలటరీ ఆఫీసర్‌‌గా విశాల్‌ లుక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్‌. వైట్‌ డెవిల్‌ పాత్రకు అర్జున్‌ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్‌‌ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్‌, అర్జున్‌‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్‌. హీరోయిన్‌ సమంత రెగ్యులర్‌ కమర్షియల్ సినిమా హీరోయిన్‌ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్‌ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు.

విశ్లేషణ:
దర్శకుడు మిత్రన్‌ నేటి డిజిటల్‌ లైఫ్‌‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిత్రన్ ఎంచుకొన్న విభిన్నమైన కథ ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంది. విశాల్ బాడీ లాంగ్వేజ్‌ ఇమేజ్‌‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్‌ క్రైమ్‌‌కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్‌ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరీకి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్‌‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్‌ సన్నివేశాలతో బోర్‌ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. టెక్నికల్‌గా మంచి కాన్సెప్ట్‌‌ను ఎంగేజింగ్‌‌గా, ఎంటర్‌‌టైనింగ్‌‌గా ప్రేక్షకులకు చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. విశాల్, అర్జున్, సమంత పాత్రలు సినిమాకు హైలెట్‌‌గా నిలుస్తాయి.యువన్‌ శంకర్‌ రాజా థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్‌ మ్యూజిక్‌‌తో మెప్పించాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు జీవం పోసింది. సెకండాఫ్‌‌లో వచ్చే సన్నివేశాలకు యువన్ సంగీతం బలంగా మారింది. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్‌ సీ విలియమ్స్‌ తన కెమెరా పనితనంతో సినిమా మూడ్‌‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. అభిమన్యుడు చిత్రానికి విశాల్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌‌గా ఉన్నాయి.

సినిమా అంతా తమిళ ఫ్లేవర్ మిగతా పాత్రల్లో నటించిన వారంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారే. తమిళ నటీనటులు పెద్దగా ఆడియెన్స్ చేరుకోలేకపోవడం ఈ సినిమాలో మైనస్. ఓవరాల్‌‌గా అభిమన్యుడు సినిమా ఎలా ఉందంటే మనీ, మైండ్ గేమ్ అనే కీలక అంశాలతో తెరకెక్కిందని చెప్పాలి.
బలం:
అర్జున్‌ నటన
విశాల్, సమంత
మిత్రన్ కథ
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫి
బలహీనతలు:
తొలి భాగంలో కొన్ని బోరింగ్‌ సీన్స్‌
తమిళ నేటివిటి
సామాన్యుడికి అర్థం కాని టెక్నికల్ అంశాలు