ఆధార్ అనుసంధానంపై సుప్రీం ఊరట

13 March, 2018 - 5:43 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లకు ఆధార్‌ అనుసంధానంపై సుప్రీంకోర్టు భారీ ఊరట ఇచ్చింది. ఈ మార్చి 31తో ముగియనున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ సేవలు తదితరాలకు ఆధార్‌ అనుసంధానం గడువును దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎకె సిక్రీ, ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్‌‌తో కూడిన ఐదుగురు న్యాయనిర్ణేతల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తుది విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి డెడ్‌‌లైన్‌ లేదని తేల్చి చెప్పింది. అసలు బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ లాంటి సేవలకు ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి కాదని చెప్పింది.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. ఆధార్ తప్పనిసరంటూ కేంద్ర బలవంతం చేయడం తగదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటికి ఆధార్ తప్పనిసరి చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఆధార్‌ మాండెటరీ, ఆధార్‌ గోప్యతపై పలు పిటీషన్లపై విచారించిన సుప్రీం మంగళవారం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బ్యాంకు ఖాతా, మొబైల్‌, తత్కాల్‌ పాస్‌‌పోర్ట్‌ లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్‌ తప‍్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత‍్వ సాంఘిక పథకాలకు మాత్రమే ఆధార్ అవసరమవుతుందని పేర్కొంది.

కాగా.. ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా లేదా అనే అంశంపై పలు స్వచ్ఛంద సంస్థల పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌ అనుసంధానం గడువును పలుమార్లు పొడిగించిన విషయం తెలిసిందే.