చార్‌ధామ్ యాత్రకూ ఆధార్ తప్పనిసరి!

01 September, 2017 - 3:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: ప్రతి సంవత్సరమూ ఉత్తరఖండ్‌‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగే బద్రీనాథ్‌, కేదార్‌‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే.. ఇకపై ఇలా చార్‌ధామ్ తీర్థయాత్ర చేయాలంటే ఆధార్‌ తప్పనిసరి కాబోతోంది! ఈ పుణ్యయాత్రలకు వెళ్లే వారికి ఆధార్‌ కార్డు తప్పనిసరి చేస్తూ కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. యాత్రికులకు ప్రభుత్వం అందిస్తున్న 20 వేల రూపాయల ట్రావెల్‌ సబ్సిడీ దుర్వినియోగం అవుతుందనే భయాందోళనతో కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17న ప్రభుత్వం సమీక్షించిన చార్‌‌ధామ్‌ తీర్థయాత్ర నిబంధనల ప్రకారం, సబ్సిడీ పొందడానికి దరఖాస్తుదారులకు ఆధార్‌ కార్డును గుర్తింపుగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

‘కర్ణాటక రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉన్న వెయ్యి నుంచి 1,500 మందికి చార్‌‌ధామ్‌ యాత్రం కోసం ప్రతి సంవత్సరం ట్రావెల్‌ సబ్సిడీ ఉంటుంది. కానీ ఈ ఏడాది యాత్రికుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలపై ట్రావెల్‌ ఆపరేటర్లు భక్తులకు పలు తప్పుడు మార్గాలను సూచిస్తున్నారు. తప్పుడు ప్రయాణ పత్రాలు సమర్పించి సబ్సిడీ మొత్తాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారు. దీంతో ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

2014లో సిద్ధరామయ్య ప్రభుత్వం దగ్గర్నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళ్లే కొందరు రాష్ట్ర నివాసులకు సబ్సిడీ అందించడం ప్రారంభించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ యాత్రకు వెళ్లేందుకు ఈ ట్రావెల్‌ సబ్సిడీని అమలులోకి తీసుకువచ్చారు.