త్వరలో మరో కొత్త ప్రభుత్వం తథ్యం

08 September, 2017 - 4:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: తమిళనాడులో త్వరలోనే మరో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ డీఎంకే పోరాటం కొనసాగుతుందని స్టాలిన్‌ స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ర్టంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, ఈ క్రమంలో త్వరలోనే మరొక ప్రభుత్వం కొలువుతీరుతుందన్నారు. ఒకే ఒక్క క్షణంలో ప్రభుత్వం మారిపోవచ్చని స్టాలిన్ అన్నారు. సీఎం పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ సిహెచ్. విద్యాసాగర్‌‌రావుకు లేఖలు ఇచ్చిన వైనాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ ప్రస్తావించారు.

డీఎంకే పార్టీ తరపున తాము రాష్ర్టపతి, గవర్నర్‌‌లను కలిసి విశ్వాస పరీక్ష నిర్వహించడం కోసం అసెంబ్లీని సమావేశపరచాలని కోరినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని స్టాలిన్‌ తెలిపారు. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోయిన్నా పళనిస్వామి ప్రభుత్వం కొనసాగడం సరి కాదని అన్నారు. గవర్నర్‌‌ను తాము మరోసారి కలిసి అసెంబ్లీని తక్షణం సమావేశపరచాల్సిన ఆవశ్యకతపై వివరిస్తామని చెప్పారు.

మరికొంత కాలం తాము వేచిచూస్తామని, అయినా గవర్నర్‌ ఎలాంటి చర్యలూ చేపట్టకపోతే.. ప్రజలు, న్యాయస్ధానాల మద్దతుతో ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేవరకూ పోరాటం చేస్తామని స్టాలిన్ అన్నారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రానికి పలు రంగాల్లో అన్యాయం చేస్తున్న మోదీ సర్కార్‌ ముందు పళనిస్వామి ప్రభుత్వం మోకరిల్లడం ఏంటంటూ స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.